← Back to PublicVibe Media

State News

రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు అందుకున్న డీన్ ఆచార్య డా. పద్మ ప్రియ

రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు అందుకున్న డీన్ ఆచార్య డా. పద్మ ప్రియ

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (పబ్లిక్ వైబ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు’ అందుకున్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య డా. పద్మ ప్రియను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు. శనివారం నాంపల్లి ప్రాంగణంలోని ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో జ్యోతిషం–వాస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ అభినందన సభ అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షత వహించగా... రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, అకడమిక్ డీన్ డా. వనజా ఉదయ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులందరూ ఆచార్య డా. పద్మ ప్రియను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సభను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ... విద్యాబోధనతో పాటు తెలుగు భాష, సాహిత్యం, కళలు, విద్యా రంగానికి ఆచార్య డా. పద్మ ప్రియ అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. రాష్ట్రస్థాయిలో ఈ పురస్కారం లభించడం విశ్వవిద్యాలయానికి, తోటి అధ్యాపక వర్గానికి, విద్యార్థి లోకానికి గర్వకారణమని ప్రశంసించారు.

డా. పద్మ ప్రియ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. తనకు లభించిన ఈ పురస్కారం కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, తనతో కలిసి పనిచేస్తున్న సహచర అధ్యాపకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ కుటుంబం అందరి ప్రోత్సాహానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.