State News
ఉమ్మడి ఖమ్మంలో వరుణుడి బీభత్సం..

ఖమ్మం, నవంబర్ 4 (పబ్లిక్ వైబ్): మురసు తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్రంగా చూపుతోంది. మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎక్కుపెట్టినట్లుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వాగులు, చెరువులు అలుగు పారుతుండగా.. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోతకు గురైన తాత్కాలిక రహదారి.. నిలిచిన రాకపోకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకాలపల్లి మండలం కంపగూడెం అడ్డరోడ్డు సమీపంలోని పాములేరు వాగుపై గతంలో వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. దీని స్థానంలో అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రహదారి.. నిరంతర వర్షాల తాకిడికి బుధవారం ఉదయం ఒక్కసారిగా కోతకు గురైంది. దీంతో పాల్వంచ - దమ్మపేట ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.