← Back to PublicVibe Media

State News

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి..

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి..

హైదరాబాద్:బస్సులో ప్రయాణికురాలితో జరిగిన వివాదం కారణంగా తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి చేరుకున్న మంత్రి.. ప్రవళిక పార్థివదేహానికి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Story image

ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, ఉద్యోగ హామీ

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

ఉద్యోగ భద్రత: ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.

ఇంటి మంజూరు: కుటుంబానికి ప్రభుత్వం తరఫున 'ఇందిరమ్మ ఇల్లు' మంజూరు చేయనున్నట్లు చెప్పారు.

ఎక్స్‌గ్రేషియా: బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు.

ఘటనపై స్పష్టత.. బస్సుల రాకపోకలు యథావిధి

ప్రయాణికురాలి నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తన వల్లే ఓ నిండు ప్రాణం బలికావడం అత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఘటనకు సంబంధించిన ప్రాంతమైన మణుగూరు డిపోలో ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారని తెలిపారు. మణుగూరు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.