State News
దిల్లీలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి కీలక ఆదేశాలు

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా దిల్లీలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చుకునేలా అనుమతి ఇస్తూ సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు నిబంధనలను ధిక్కరించి మార్కెట్లో అన్ని రకాల బాణసంచా విక్రయిస్తుండటంపై మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
"ఈ రోజు మీడియాలో ఒక ఫొటో వచ్చింది. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని నిన్న మేం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. మార్కెట్లో లైసెన్స్ ఉన్నవి, లేనివి, క్యూఆర్ కోడ్ లేనివి.. ఇలా అన్ని రకాల బాణసంచా విక్రయిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్లో విక్రయిస్తున్న ఆ టపాసుల సంగతేంటో చూడండి" అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతోనే తాము బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై పరిమితులు విధించామని న్యాయస్థానం గుర్తుచేసింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు సరిగ్గా అమలు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే విధంగా నిబంధనలను ఉల్లఘించి అన్ని రకాల టపాసులు కాలిస్తే, దిల్లీలో కాలుష్య సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించింది.
మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఆచారాలను పాటించే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఆ ఆచారాలు లేదా సంప్రదాయాల పేరుతో రాజ్యాంగపరమైన ఆంక్షలను, పౌరుల ఆరోగ్య రక్షణ హక్కును అతిక్రమించడానికి వీيలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.